Pawan Kalyan: ఇపుడిదే విషయమై జనసేన పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణాలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఎన్నికల వేడి అన్నీ పార్టీలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేయటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ నుండి పోటీచేయాలని రంగం సిద్ధం చేసుకున్నారు. కాబట్టి బీజేపీ హ్యాపీగానే ఉంది. మరి కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటి ? అభ్యర్ధిని వెతిక్కునే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పార్టీలోన అంతర్గత వివాదాలు మొదలయ్యాయి.
సరే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మరి అధికార టీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటి ? ఈ పార్టీలో కూడా అంతర్గత గొడవలు రోడ్డునపడ్డాయి. స్వయంగా కేసీయార్ ఎంపికచేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గంలోని చాలామంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కూసుకుంట్ల గెలుపుకు పనిచేయాల్సిందే అని కేసీయార్ చెప్పినా సుమారు 40 మంది నేతలు వినటంలేదు. కూసుకుంట్ల గెలుపుకు తాము పనిచేసేదిలేదని తెగేసిచెప్పారు. ఇలా చెప్పినవారిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల ఛైర్మన్లు, సర్పంచులున్నారు. కాబట్టి టీఆర్ఎస్ లో గొడవలు తారాస్ధాయికి చేరుకుంటున్నది.
మరీ పరిస్ధితుల్లో జనసేన ఏమి చేయబోతున్నది అనే ప్రశ్న కీలకంగా మారింది. నిజానికి జనాలెవరు జనసేన గురించి ఆలోచించాల్సిన అవసరమైతే లేదు. కానీ తెలంగాణా పర్యటనలో పవన్ కల్యాణ్ మాట్లాడుతు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 30 నియోజకవర్గాల్లో పొత్తులు లేకుండానే గెలుచుకునే సత్తా ఉందని కూడా అన్నారు. అందుకనే ఇపుడు మునుగోడు ఉపఎన్నికలో జనసేన పోటీచేస్తుందా చేయదా అనే విషయమై చర్చ నడుస్తోంది. పోటీ చేయాలని అనుకుంటే వెంటనే అదే విషయాన్ని పవన్ ప్రకటించాలి. ఒకవేళ పోటీ చేసే ఉద్దేశ్యంలేకపోయినా ఆ విషయాన్నైనా చెప్పేయచ్చు.
అయితే పవన్ మాత్రం ఏ విషయమూ ప్రకటించలేదు. దాంతోనే జనసేన నేతలతో పాటు అభిమానుల్లో కూడా అసహనం పెరిగిపోతోంది. ఒకవైపు అన్నీ ప్రధానపార్టీలు అభ్యర్ధుల విషయంలో సమావేశాలు పెట్టుకుంటుంటే పవన్ మాత్రం ఏమీ పట్టనట్లు ఉండటమే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మునుగోడు ఉపఎన్నిక విషయమై పవన్ ఇప్పటివరకు పార్టీ నేతలతో సమావేశం పెట్టుకున్నారో లేదో కూడా తెలీటంలేదు.
అసలు తెలంగాణా నేతలు ఉపఎన్నిక విషయమై పవన్ కు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారనేది కీలకంగా మారింది. ఈమధ్యనే పవన్ ఇంట్లో కొందరు తెలంగాణా నేతలు కలిసినట్లు సమాచారం. ఆ సమావేశంలో ఏ విషయాలపై మాట్లాడుకున్నారనేది బయటకు పొక్కలేదు. కాబట్టి పవన్ మౌనం దేనికి సంకేతమో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఉపఎన్నికలో పోటీచేస్తే పార్టీ సత్తా ఏమిటో బయటపడుతుందని నేతలు చెప్పుకుంటున్నారు. మరి పవన్ ఏమిచేస్తారో చూడాలి.