Janasena: బీహార్ నుండి పవన్ ఏమి నేర్చుకున్నారు ?

Janasena: బీహార్ రాజకీయాలు దేశమంతటినీ ఆకర్షించింది. అధికార భాగస్వాములైన బీజేపీ-జేడీయూలు విడిపోవటం ఆశ్చర్యం కలిగించింది. బీజేపీతో కటీఫ్ చెప్పిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ వెంటనే ఆర్జేడీ చీఫ్ తేజస్వియాదవ్ నాయకత్వంలోని మహాఘట్ బంధన్ తో కలిసిపోయారు. దాంతో ముఖ్యమంత్రిగా రాజీనామాచేసిన నితీష్ మరుసటిరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ రాజకీయాలంతా జెట్ స్పీడులో చకచకా జరిగిపోయాయి.

సరే వాళ్ళ గొడవను కాసేపు పక్కనపెట్టేస్తే దాన్నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి నేర్చుకున్నట్లు ? ఏపీలో బీజేపీ అయినా జనసేన అయినా ప్రత్యపక్షాలే అనటంలో సందేహంలేదు. కాబట్టి బీహార్ రాజకీయాల నుండి పవన్ నేర్చుకునేదేముంటుందని అనుకుంటే పొరబాటు పడినట్లే. ఇక్కడ అధికారం వదులుకోవటం మళ్ళీ అధికారంలోకి రావటం ముఖ్యంకాదు. సరైన సమయంలో బీజేపీ వదులుకోవటమే నితీష్ చేసిన తెలివైనపని.

ఇక్కడ బీజేపీ వ్యవహారం ఎలాగుందో యావత్ దేశం చూస్తున్నదే. తనకు మిత్రపక్షాలేవో ప్రత్యర్దులెవరో కూడా ఎవరికీ అర్ధం కావటంలేదు. ప్రత్యర్ధిపార్టీలను రాచిరంపాన పెడుతున్నట్లే మిత్రపక్షాలనూ బీజేపీ ఇబ్బంది పెడుతోంది. ఇందుకనే ప్రత్యర్ధులైనా, మిత్రపక్షాలైనా బీజేపీ కారణంగా బాగా సఫోకేషన్ ఫీలవుతున్నారు. ఎందుకంటే మిత్రపక్షాల ఎంఎల్ఏలు, ఎంపీలను కూడా వదలటంలేదు. దీనికి ఉదాహరణ కూడా బీహార్లోనే కనబడుతోంది. సంవత్సరాల పాటు తమతో నమ్మకంగా ఉన్న ఎల్జేపీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన వెంటనే అంతర్గతంగా గొడవలు ముదిరిపోయాయి.


వాళ్ళ గొడవలతో తనకేం సంబంధం అన్నట్లుగా బీజేపీ ఊరికేవుండలేదు. వాళ్ళ గొడవల్లో వేలుపెట్టి పార్టీ నిలువుగా చీలిపోయేందుకు కారణమైంది. పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని పార్టీ మైనారిటిలో పడిపోవటంతో వెంటనే చీలికవర్గాన్ని ఎన్డీయేలో చేర్చుకుని కేంద్రంలో మంత్రిపదవులు కూడా ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా లేదా పెట్టి మరీ తాను లాభంపడాలన్నది మాత్రమే బీజేపీ సిద్ధాంతంగా కనబడుతోంది. కాబట్టి బీజేపీ విషయంలో పవన్ జాగ్రత్తగా ఉండాల్సిందే.


ఇపుడు పవన్ పరిస్ధితి ఎలాగైపోయిందంటే మనస్పూర్తిగా బీజేపీతో స్నేహం చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో బీజేపీని వదిలేయాలన్నా వదల్లేకపోతున్నారు. పవన్ వదిలేయాలని అనుకున్నా బీజేపీ తుమ్మజిగురు లాగ అతుక్కుపోతుంది. తనదగ్గరకు వచ్చిన వారిని పీల్చిపిప్పిచేసేంతవరకు బీజేపీ వదిలిపెట్టదు. ఇపుడు బీజేపీకి ఉన్న ఓట్లు సున్నాయే కాబట్టి కామ్ గా ఉంది.

అదే వచ్చే ఎన్నికల్లో ఏ కారణంవల్లయినా కొన్ని సీట్లు తెచ్చుకున్నదంటే చాలు అప్పుడు అసలు స్వరూపం బయటపడుతుంది. దానికి పవన్ ముందుగానే సిద్ధపడాల్సుంటుంది. బీజేపీ అనేది ఎంతమాత్రం నమ్మదగ్గపార్టీకాదని ఇప్పటికే ఎన్నోసార్లు నిర్ధారణైంది. ఇప్పటికిప్పుడు పవన్ చేయగలిగేదేమీ కూడా లేదు. కానీ ఇదే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మొదటికే మోసం గ్యారెంటీ అని చెప్పచ్చు.