Pawan Kalyan: రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారో చెప్పాలి

Pawan Kalyan:  ‘అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడేబాధ్యతను నేను తీసుకుంటాను’..ఇది తాజాగా పర్చూరు సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన. బాధ్యతను అయితే తీసుకుంటానని చెప్పారు కానీ ఆ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారో మాత్రం చెప్పలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రం సుమారు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. మనకన్నా ఎక్కువ అప్పులున్న రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి కానీ వాటిగురించి ఇపుడు అవసరంలేదు.

ఇపుడు మనరాష్ట్రం గురించి విషయానికి వస్తే ఈ అప్పులు ఎవరు అధికారంలో ఉన్నా తీరేదికాదు. అంతకంతకు రాష్ట్రం అప్పులపాలవ్వటం మినహా వేరే దారిలేదు. రాష్ట్రం అప్పుల్లో నుండి బయటపడాలంటే ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఉచితపథకాలు, సంక్షేమపథకాలన్నింటినీ రద్దుచేస్తే ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం ఒక్కసారిగా తగ్గిపోతుంది.

అలా మిగిలిన వేల కోట్లరూపాయల డబ్బును ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు, మౌళిక సదుపాయాల మీద ఖర్చుచేస్తే ఎప్పటికో మెల్లిగా కోలుకుంటుంది. అయితే ఈ ఉచితాలు, సంక్షేమాలు రద్దుచేయటం సాధ్యమేనా ? ఎప్పటికీ సాధ్యంకాదన్న విషయం అందరికీ తెలిసిందే. మరి పవన్ ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల నుండి కాపాడుతారు. ఇపుడీ విషయమే జనాలకు చెప్పాల్సిన బాధ్యత పవన్ మీదుంది. జనసేన అధినేత చెప్పే ఫార్ములా గనుక జనాలను మెప్పించగలిగితే అధికారం అందివచ్చే అవకాశముంది.

నిజానికి రాష్ట్ర విభజన జరగటమే అడ్డుగోలుగా జరిగింది. అప్పులన్నింటినీ ఏపీ నెత్తినా పడేసిన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆస్తులను, కామధేనువులాంటి రాజధాని హైదరాబాద్ ను తెలంగాణాకు ఇచ్చేసింది. అప్పటినుండే ఏపీ కష్టాలు మొదలయ్యాయి. దానికితోడు చంద్రబాబునాయుడు పరిపాలనతో రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల ఊబిలో కూరుకుపోయింది. ఇపుడు జగన్ పరిపాలనలో ఆ ఊబి మరింతగా లోతులోకి వెళిపోతోంది.

2014 ఎన్నికల్లో కూడా రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా అప్పులు తీరుస్తానని, కాపులను బీసీల్లో చేరుస్తానని ఆచరణసాధ్యంకానీ హామీలను చాలానే ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటిలోను ఫెయిలయ్యారు. అందుకనే 2019 ఎన్నికల్లో జనాలంతా జగన్మోహన్ రెడ్డిని బంపర్ మెజారిటితో గెలిపించుకున్నారు. రేపటి ఎన్నికల్లో జగన్ను కాదని జనాలు జనసేనను గెలిపించాలంటే ఆ బాధ్యత పవన్ మీదే ఉంది.

కాబట్టి రాష్ట్రం అప్పులనుండి బయటపడేయటానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, ప్రత్యేకహోదా సాధన విషయంలోను, విశాఖస్టీల్స్ ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి తన దగ్గరున్న ప్రణాళికలను పవన్ జనాలకు వివరించాలి. పవన్ వాదనతో జనాలు సానుకూలంగా స్పందిస్తే వచ్చే ఎన్నికల్లో జనసేనకు అధికారం ప్రాప్తిస్తుందని అనుకోవచ్చు. లేకపోతే పవన్ను కూడా జనాలు చంద్రబాబులాగే జమకట్టేయక తప్పదు. కాబట్టి విజయదశమి నుండి మొదలయ్యే యాత్రలో పై సమస్యలకు పవన్ జవాబులు సిద్ధంగా పెట్టుకుని తీరాలి. లేకపోతే యాత్రంతా వృధా అవ్వక తప్పదు.