janasena : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సడెన్ గా అమెరికాకు వెళ్ళారు. సోమవారం రాత్రి ఆయన అమెరికాకు పయనమయ్యారు. పవన్ అమెరికా పర్యటన పార్టీలోనే చాలామందికి తెలీదని సమాచారం. మరింత అర్జంటుగా ఎందుకని అమెరికాకు వెళ్ళినట్లు ? ఇపుడీ విషయమే నేతలకు అర్ధం కావటంలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పవన్ అమెరికా పర్యటనకు నాలుగు రకాల కారణాలున్నాయట.
అవేమిటంటే మొదటిది వ్యక్తిగత పనుల మీద వెళ్ళారట. రెండో కారణం ఏమిటంటే అనారోగ్యం కారణంగా డాక్టర్ల సలహా ప్రకారం అమెరికాకు వెళ్ళినట్లు చెబుతున్నారు. ఇక మూడో కారణం ఏమిటంటే నిధుల సమీకరణే టార్గెట్ గా పెట్టుకుని పవన్ అమెరికా పర్యటనకు వెళ్ళినట్లు చెబుతున్నారు. ఇదే విషయమై పవన్ గతంలో కూడా అమెరికాకు వెళ్ళారు కాబట్టి ఇప్పటి పర్యటన కారణం కాస్త దగ్గరగానే ఉంది. ఇక చివరది నాలుగో కారణం ఏమిటంటే టీడీపీతో పొత్తుల విషయం చర్చించేందుకే వెళ్ళారంటున్నారు.
ఈ నాలుగు కారణాల్లో నిధుల సమీకరణ అనేది తప్ప మిగిలిన వాటికి పెద్దగా అవకాశం లేదనే అనిపిస్తోంది. పొత్తుల విషయాన్ని మాట్లాడుకోవాలంటే నేరుగా టీడీపీ నేతలు పవన్ ఇంటికే వెళతారు. లేదా జనసేన నేతలు చంద్రబాబునాయుడు దగ్గరకు వెళతారు. కాకపోతే ఈ విషయంపై ప్రచారం ఎందుకు జరుగుతోందంటే కొంతమంది టీడీపీ నేతలు ఇపుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి. వివిధ కారణాలతో కొందరు సీనియర్ తమ్ముళ్ళు ఇపుడు అమెరికాలోనే ఉన్నారు. అందుకనే ఈ ప్రచారం జరుగుతోంది.
ఇక నిధుల వేటంటే పార్టీ నడపటానికి, రాబోయే ఎన్నికల నిర్వహణకు నిధులు ఎంతవసరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైకి ఎన్నిమాటలు చెప్పినా చివరకు చేతిలోడబ్బులేకపోతే అడుగుకూడా ముందుకుపడదు. పైగా వచ్చే ఎన్నికలు టీడీపీ, వైసీపీలకు చాలా కీలకం. అందుకనే గులుపుకోసం అభ్యర్ధులు ఎంతైనా ఖర్చుకు వెనకాడేది లేదన్నట్లుగా ఉన్నారు. మధ్యలో జనసేన అభ్యర్ధులు గట్టిపోటీ ఇవ్వాలంటే నిధులఖర్చు భారీ ఎత్తున ఉండాల్సిందే. అందుకనే అమెరికా పర్యటనలో పలువురిని కలిసి నిధులను సేకరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ కారణం మాత్రం వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది.