Janasena: వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబునాయుడు మనసులో ఏముందో తెలీదు. ఒకసారి జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబే అంటారు. మరోసారి పవన్ నుండి వచ్చిన ప్రతిపాదనకు అసలు ఎలాంటి రెస్పాన్స్ ఉండటంలేదు. దాంతో పొత్తుల విషయంలో రెండుపార్టీల్లోను అయోమయమైతే పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే జనసేనతో పొత్తు విషయంలో కొందరు తమ్ముళ్ళు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళ వ్యాఖ్యలు చూసిన తర్వాత జనసేనను బాగా చిన్నచూపు చూస్తున్నట్లే అనుమానంగా ఉంది.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆముదాలవలస మాజీ ఎంఎల్ఏ కూనరవికుమార్ మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జనసేనకు 15 అసెంబ్లీలు, రెండు పార్లమెంటు సీట్లు కేటాయించబోతున్నట్లు మీడియాతో చెప్పారు. మరీ ఇంత తక్కువ సీట్లా అని మీడియా అడిగినపుడు ఇంతకన్నా జనసేనకు అవసరంలేదని కూన చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే కూన దృష్టిలో జనసేన అంటే చాలా చిన్నచూపున్నట్లు అర్ధమైపోతోంది. ఇదే విధమైన కామెంట్లు గతంలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా చేశారు.
అప్పట్లో చింతకాయల జనసేనతో పొత్తువిషయమై మాట్లాడుతు 2019 ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్లశాతం ఆధారంగానే సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. అంటే పోయిన ఎన్నికల్లో టీడీపీకి సుమారు 39 శాతం ఓట్లొస్తే జనసేనకు 5 శాతం ఓట్లొచ్చాయి. ఈ లెక్కన జనసేనకు వచ్చే ఎన్నికల్లో సీట్లంటే సుమారు 9 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు సీటు వస్తే చాలాగొప్ప. నిజంగా జనసేనను టీడీపీ అవమానించటమే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జనసేన తక్కువలో తక్కువ 120 సీట్లలో పోటీచేయటానికి రెడీ అవుతోంది. బీజేపీతో పొత్తుంది కాబట్టి మిగిలిన సీట్లను కమలంపార్టీకి వదిలేయాలన్నది జనసేన నేతల ఆలోచన.
అంటే జనసేన నేతల ఆలోచనకు టీడీపీ నేతల ఆలోచనకు మధ్య ఎంత తేడావుందో అర్ధమైపోతోంది. జనసేనతో పొత్తుపెట్టుకోవాలని తమ్ముళ్ళకు నిజంగానే ఉంటే పై ప్రతిపాదనలు చేయరు, మాటలు మాట్లాడరు. పొత్తు పెట్టుకునే పార్టీల బలాబలాలతో సంబంధంలేకుండా ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో సాగటమే పొత్తుధర్మం. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య నిజంగానే పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటే జనసేనకు కనీసం 40 సీట్లు ఇవ్వాల్సుంటుంది. అలాగే బీజేపీకి ఓ పది సీట్లు వదులుకోకతప్పదు.
అలాగే జనసేనకు నాలుగు పార్లమెంటు సీట్లు, బీజేపీకి రెండు ఎంపీ సీట్లను టీడీపీ వదులుకోవాల్సుంటుంది. కాస్త అటుఇటుగా సీట్లు ఖాయమైతేనే అన్నీపార్టీలకు గౌరప్రదంగా ఉంటుంది. ఏదేమైనా పొత్తుల విషయం అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబే అన్న విషయం తెలిసిందే. కానీ ఈలోగా నేతలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతుండటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా తెలంగాణా ఎన్నికలతోనే టీడీపీ భవిష్యత్తు ఏమిటో తేలిపోతుంది. తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కుదిరితే ఏపీలో కూడా పొత్తు ఖాయమే. చూద్దాం చివరకు ఏమవుతుందో.