Breaking: ఎంపీ అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉంది: సీబీఐ

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీబీఐ అవినాష్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారని సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి పిటిషన్ కు వ్యతిరేకంగా మరో పిటిషన్ హైకోర్టులో సీబీఐ ఫైల్ కూడా చేసింది.

ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తుకు సహకరించకుండా, సమాధానాలు ఇవ్వకుండా, వాస్తవాలను బయట పెట్టకుండా అవినాష్ వ్యవహరిస్తున్నారని సీబీఐ ఫైర్ అయ్యింది. ఈ కారణాలవల్ల అతడిని అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

అవినాష్ రెడ్డికి భయపడి ఎవరూ కూడా సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం లేదని, ఇక అతని అనుచరాల వల్ల దర్యాప్తుకు ఆటంకం కూడా కలుగుతోందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పుకొచ్చింది. వివేకా హత్య కుట్రకు, సాక్షాలను మాయం చేయడంలో అవినాష్ హస్తం ఉందని కూడా సీబీఐ సంచలనం వ్యాఖ్యలు చేసింది.